బీజేపీ ఎమ్మెల్యే కొడుకు బరితెగింపు.. ఐదుగురిని ఢీకొట్టి వారిపైనే ఆగ్రహం.. వీడియో ఇదిగో!

  • వాహనంతో మధ్యప్రదేశ్‌ బీజేపీ ఎమ్మెల్యే పృథమ్ లోధి కుమారుడి బీభత్సం
  • సైరన్ వినిపించినా ఎందుకు పక్కకు జరగలేదని బాధితులపైనే ఆగ్రహం
  • ఘటనను వీడియో తీస్తున్న వారిపై బెదిరింపులు
  • చట్టం తన పని తాను చేసుకుపోతుందన్న ఎమ్మెల్యే పృథమ్ లోధి
  • ఎమ్మెల్యే కొడుకుపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన పోలీసులు
మధ్యప్రదేశ్‌లో అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే కుమారుడు అధికార దర్పాన్ని ప్రదర్శించాడు. తన థార్ ఎస్‌యూవీతో ఐదుగురిని ఢీకొట్టి గాయపరిచాడు. అనంతరం, ప్రమాదం గురించి నిలదీసిన బాధితులపైనే ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ ఘటన శివ్‌పురి జిల్లాలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. పిచోర్ బీజేపీ ఎమ్మెల్యే పృథమ్ లోధి కుమారుడు దినేష్ లోధి గురువారం ఉదయం 7:30 గంటల సమయంలో తన థార్ వాహనంలో వేగంగా వెళ్తున్నాడు. ఈ క్రమంలో ఓ బైక్‌పై వెళ్తున్న ముగ్గురిని, రోడ్డుపై నడుస్తున్న ఇద్దరు మహిళలను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో సంజయ్ పరిహార్, ఆశిష్ పరిహార్, అన్షుల్ పరిహార్, సీతా వర్మ, పూజా సోని గాయపడ్డారు. వారి తల, కాళ్లు, చేతులకు గాయాలు కావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు.

ప్రమాదం జరిగిన తర్వాత దినేష్ లోధి బాధితులతో వాగ్వాదానికి దిగాడు. "నేను సైరన్ వేస్తున్నప్పుడు పక్కకు ఎందుకు జరగలేదు?" అని నిర్లక్ష్యంగా ప్రశ్నించాడు. ఈ ఘటనను కొందరు వీడియో తీస్తుండగా "వీడియో తీయొద్దు బిడ్డా" అంటూ వారిని బెదిరించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ ఘటనపై కరెరా పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. తన కుమారుడి చర్యపై ఎమ్మెల్యే పృథమ్ లోధి స్పందించారు. "చట్టం తన పని తాను చేసుకుపోతుంది. నాకు కుటుంబం కన్నా ప్రజలే ముఖ్యం. బాధితులకు తప్పకుండా న్యాయం జరగాలి" అని ఆయన స్పష్టం చేశారు.

Pritham Lodhi
BJP MLA
Madhya Pradesh
Road Accident
Shivpuri
Dinesh Lodhi
Pichore
Thar SUV
Hit and Run

More Telugu News